ప్రజాస్వామ్యంలో ఉన్నమా?.. పాకిస్తాన్‌లో ఉన్నమా?: మంత్రి హరీష్ పర్యటన వేళ పోలీసులపై సీతక్క ఫైర్..
ములుగు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన వేళ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
ములుగు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన వేళ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలను పోలీసు స్టేషన్‌లో ఉంచడంపై.. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండ్లు కోల్పోయిన బాధితులు మంత్రిని కలిసేందుకు వస్తే ఎలా అని ప్రశ్నించారు.
‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పాకిస్తాన్‌లో ఉన్నామా?’’ అని సీతక్క ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలను, ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్‌లు చేశారని అన్నారు. మంత్రి వస్తున్నప్పుడు వినతిపత్రం కూడా అందజేసే స్వేచ్ఛ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి పాల్గొంటున్న మీటింగ్ ప్రజాధనంతో పెడుతున్నారని.. కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అయితే పార్టీ మీటింగ్ అయితే తాము పట్టించుకునే వాళ్లం కాదని.. అది ప్రజల సొమ్ముతో పెడుతున్న మీటింగ్ అని అన్నారు.
అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ఇండ్ల కోసం వినతిపత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మహిళలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారని అన్నారు. వాళ్లకు కావాల్సిన వాళ్లను మాత్రం లక్షలు ఖర్చులు పెట్టి బస్సులో మీటింగ్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. అది పార్టీ మీటింగ్ కాదని.. ప్రజల మీటింగ్ అని అన్నారు. వినతిపత్రం కూడా ఇచ్చే అవకాశం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.