MLA Rajasingh's wife: ఎంఐఎం మద్దతును నిలుపుకోవడంతో పాటు ముస్లిం ఓటు బ్యాంకును కాపాడాలనే ఉద్దేశంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను జైల్లోనే ఉంచారని ఆయన భార్య ఉషా బాయి ఆరోపించారు. కేటీఆర్ పై పీడీ యాక్ట్ ప్రయోగించాలని ఆమె డిమాండ్ చేశారు.
Hyderabad: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) పై పీడీ యాక్ట్ విధించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి డిమాండ్ చేశారు. ఏఐఎంఐఎంను బుజ్జగించేందుకు, ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్ ను జైల్లో పెట్టారని ఆమె ఆరోపించారు. వివరాల్లోకెళ్తే.. స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారూఖీని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి శిల్ప కళావేదికలో షో నిర్వహించినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పీడీ యాక్ట్) ప్రయోగించాలని ఎమ్మెల్యే టీ.రాజా సింగ్ భార్య టీ.ఉషాబాయి డిమాండ్ చేశారు.
“మునావర్ ఫరూఖీ తన ప్రదర్శనలో హిందూ దేవుళ్లను అవమానపర్చడం/దుర్వినియోగం చేసినందుకు చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్నందున రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, దాదాపు 2000 మంది పోలీసు సిబ్బందిని ఆ కార్యక్రమం సజావుగా సాగేందుకు మోహరించడంతో మూడవ తరగతి కామెడీ షో జరిగింది. ఇంకా చాలా రాష్ట్రాలు అతని ప్రదర్శనను నిలిపివేశాయి. అయితే శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో అశాంతిని ప్రేరేపించిన కేటీఆర్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి వెంటనే అరెస్ట్ చేయాలి. కేటీ రామారావు (కేసీఆర్) మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహించారు అని రాజాసింగ్ భార్య ఉషాబాయి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించాలనీ అలా చేస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందని ఆమె ఆన్నారని సియాసత్ నివేదించింది.
“ఏఐఎంఐఎంను బుజ్జగించడం.. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునే ఉద్దేశ్యంతో కుట్రతో ఎమ్మెల్యే రాజాసింగ్ ను జైల్లో ఉంచారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఓటు బ్యాంకు చూసి కేసీఆర్ భయాందోళనకు గురయ్యారు. ఈ భయాందోళనలో కేసీఆర్ తన కొడుకు, ఒవైసీతో కలిసి ఈ కుట్ర పన్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ హిందుత్వ నాయకుడు. అతను హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు, దాని కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులు నేడు ఆయనను అనుసరిస్తున్నారు. హిందువులను కించపరిచే లక్ష్యంతో ఈ మొత్తం కుట్ర చేశారు. రాజా సింగ్ ను జైల్లో పెట్టారు" అని ఆమె పేర్కొన్నారు.
రాజా సింగ్ అరెస్ట్ నేపథ్యం..
ఆగస్టు చివరిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి సస్పెండ్ కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదోళనలు, నిరసన కార్యక్రమాలు, రాజాసింగ్, బీజేపీ కి వ్యతిరేకంగా ర్యాలీలు కొనసాగాయి. ఈ క్రమంలోనే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించి... జైలుకు పంపారు. మహమ్మద్ ప్రవక్తపై ఇదివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మను సైతం బీజేపీ సస్పెండ్ చేసింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాలు, లక్డీకాపూల్‌లోని పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం, పురానీ హవేలీలోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు నగరంలోని ఇతర ముఖ్య ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రవక్త ముహమ్మద్‌పై రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది.
