వినాయక చవితి ఉత్సవాల తొలి రోజే  ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మద్దుతుగా ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

వినాయక చవితి ఉత్సవాల తొలి రోజే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మద్దుతుగా ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. రాజా సింగ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసన చేపట్టారు. రాజాసింగ్ కు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని.. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, రాజాసింగ్ మద్దతుదారులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఇక, సైఫాబాద్ పోలీసుల బృందం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, రాజా సింగ్‌ను పదేపదే మతపరమైన నేరాలకు పాల్పడినందుకు పోలీసులు ఆయనపై ఇటీ పీడీ యాక్ట్ నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.

ఇక, ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ రోజు ఉదయం తొలిపూజ చేశారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ఖైరతాబాద్‌ గణనాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతిని దర్శించుకునేందుకు తొలి రోజే భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక, ఈ ఏడాది శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనిమిస్తున్న సంగతి తెలిసిందే. 50 అడుగుల ఎత్తులో ఏర్పాటైన మహాగణపతిని తొలిసారిగా మట్టితో తీర్చిదిద్దారు.