గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను నూతన సచివాలయంలోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం గేట్ వద్ద ఆయనను నిలిపివేశారు.

హైదరాబాద్‌: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను నూతన సచివాలయంలోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం గేట్ వద్ద ఆయనను నిలిపివేశారు. అయితే ఈ పరిణామాలపై రాజాసింగ్ సీరియస్‌గా స్పందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ మీటింగ్ పెట్టారని.. నగరానికి చెందిన అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు రావాలని చెప్పారని అన్నారు. ఈ క్రమంలోనే తాను సచివాలయానికి వెళ్లానని.. అయితే తనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. తనను అడ్డుకోవడం బాధగా అనిపించిందని చెప్పారు. 

మీటింగ్ కోసం పిలిస్తే వచ్చిన తనను పోలీసులు అడ్డుకుని తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని రాజాసింగ్ అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టైం పాస్ కోసం మీటింగ్ పెట్టారా? అని ప్రశ్నించారు.నూతన సచివాలయంలోని ఎమ్మెల్యేలకే అనుమతి లేకపోతే ఇంక ఎవరిని సచివాలయానికి అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటని అన్నారు. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోమని ఎవరు చెప్పారో పోలీసులు వివరణ ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.