గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.  41 పీఆర్సీ కింద ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారని.. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రిమాండ్‌ను రిజెక్ట్ చేసింది కోర్ట్. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. రాజాసింగ్ న్యాయవాదులు చేసిన వాదనతో కోర్ట్ ఏకీభవించింది. దీంతో బెయిల్‌పైన రాజాసింగ్ విడుదల కానున్నారు. 41 పీఆర్సీ కింద ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారని.. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్ట్ నిబంధనలు పాటించనందుకు గాను పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్.. రాజాసింగ్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపింది. 

తొలుత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతకుముందు నాంపల్లి కోర్ట్ బయట ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయనను నాంపల్లి కోర్ట్‌లో హాజరు పరిచారు. విషయం తెలుసుకున్న ఓ వర్గం యువకులు పెద్ద సంఖ్యలో కోర్ట్ వద్దకు చేరుకుని రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు రాజాసింగ్ మద్ధతుదారులు కూడా భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. 

ALso Read:రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడకు తరలింపు

ఇకపోతే.. ఇవాళ ఉదయం రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బొల్లారం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు. మునావర్ ఫరూఖీ కామెడీ షో ను నిర్వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్ లో వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో ఓ వర్గాన్ని కించపర్చేలా ఉన్నాయని ఎంఐఎం నేతలు సోమవారం నాడు ఆందోళన నిర్వహించారు. మంగళవారం నాడు ఉదయం వరకు ఎంఐఎం శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపణలు చేసింది. దీంతో ఈ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌ను హైద్రాబాద్ పోలీసులు కోరారు..