హైదరాబాద్: తెలంగాణలో ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన సోదరుడికి కూడా కరోనా వైరస్ సోకినట్లు సమాచారం.

అదే విధంగా, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావుకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన కుటుంబ సభ్యులు, వర్కర్లు 8 మందికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ప్రజలకు గత 24 గంటల్లో కరోనా వైరస్ కొంత ఊరటనిచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో గత 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గాయి. నిన్న 273 కేసులు మాత్రమే హైదరాబాదులో నమోదయ్యాయి. రంగారెడ్డి, వరంగల్ అర్భన్, మేడ్చెల్ జిల్లాల్లో కూడా కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి.

గత 24 గంటల్లో తెలంగాణలో 983 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులసంఖ్య 67,660కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 11 మంది కరోనా వైరస్ తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 551కి చేరుకుంది.   

ఆదిలాబాద్ జిల్లాలో 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో 13, జనగామ జిల్ాలలో 13, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12, జోగులాంబ గద్వాల జిల్లాలో 12, కామారెడ్డి జిల్లాలో 28, కరీంనగర్ జిల్లాలో 54 కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి.

ఖమ్మం జిల్లాలో 23, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 7, మహబూబ్ నగర్ జిల్లాలో 21, మహబూబాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదు కాగా, మంచిర్యాలలో ఒక్క కేసు మాత్రమే రికార్డైంది. మెదక్ జిల్లాలో 18, మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లాలో 48, ములుగు జిల్లాలో 14 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నాగర్ కర్నూలు జిల్లాలో 32, నల్లగొండ జిల్లాలో 11, నారాయణపేట జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 2, నిజామాబాద్ జిల్లాలో 42, పెద్దపల్లి జిల్లాలో 44, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20, రంగారెడ్డి జిల్లాలో 73, సంగారెడ్డి జిల్లాలో 37, సిద్ధిపేట జిల్లాలో 6, సూర్యాపేట జిల్లాలో 11, వికారాబాద్ జిల్లాలో 4, వనపర్తి జిల్లాలో 26, వరంగల్ రూరల్ జిల్లాలో 25, వరంగల్ అర్బన్ జిల్లాలో 57, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి.