నన్ను చంపేందుకు కుట్ర..: కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపణలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. తన హత్యకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. జోగు రామన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కంది శ్రీనివాస్ తనపై తన కుటుంబంపై సంస్కారం, పద్ధతి లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆస్తులపై తప్పుడు ఆరోపణలు చేసిన శ్రీనివాస్‌రెడ్డిపై పరువునష్టం కేసు పెడతానని హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని.. లేకుంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే శ్రీనివాస్ ఇక్కడికి వచ్చారని.. టికెట్ రాకపోతే అమెరికా పారిపోతారని.. అలాంటి వ్యక్తికి ఆదిలాబాద్ ప్రజల ఆశీస్సులు ఎలా దక్కుతాయని ప్రశ్నించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఎలాంటి మర్యాద లేకుండా శ్రీనివాసరెడ్డి అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జోగు రామన్న సవాల్ విసిరారు.
‘‘శ్రీనివాస్ రెడ్డి మొదట తనను తాను బలమైన ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్తగా, బీఎల్ సంతోష్‌కు సహచరుడిగా చెప్పుకున్నారు. బీజేపీలో చేరారు. కొన్ని నెలల తర్వాత, ఆయన బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల టికెట్ ఆశించి నాపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఆయన ఎత్తుగడలను, చర్యలను నిశితంగా గమనిస్తున్నారు’’ అని జోగు రామన్న చెప్పారు.