ఖమ్మం: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్ర గ్రామంలో తనపై జరిగిన దాడి మీద కాంగ్రెసు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరిన శాసనసభ్యురాలు హరిప్రియా నాయక్ తీవ్రంగా స్పందించారు. కామేపల్లి మండలంలో గడీల రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె విమర్శించారు. 

నెల రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాను తిరుగుతున్నానని, ఎక్కడా జరగని ఘటనలు కామేపల్లి మండలంలో జరుగుతున్నాయని హరిప్రియ అన్నారు. దాడి చేసినవారిపై ప్రజలు తిరగబడ్డారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. 

ఈ రోజు తనపై జరిగిన దాడి  ఓ గిరిజన మహిళపై జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు. కాంగ్రెసు నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని, ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని ఆమె అన్నారు. తన వెనక ప్రజా బలం ఉందని ఆమె అన్నారు.

సంబంధిత వార్త

టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడి