1984లో వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. మృతదేహాల కోసం తవ్వకాలు

మూడు దశాబ్ధాల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన లారీ ఇప్పుడు బయట పడటంతో.. మృతుల బంధువులు తమ వారి మృతదేహాల కోసం తవ్వకాలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. 1984లో భారీ వర్షాల కారణంగా కరీంనగర్ మండలం ఇరుకుల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఆ సమయంలో వంతెన మీదుగా వరద ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి..

అయితే ఈ విషయం తెలియని ఓ లారీ వంతెన దాటేందుకు ప్రయత్నించి ప్రవాహ వేగంలో కొట్టుకుపోయింది.. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సహా ముగ్గురు గల్లంతయ్యారు.. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత కొట్టుకుపోయిన వారి కుటుంబసభ్యులు వాగులో వెతికారు.. కానీ ఎక్కడా లారీ ఆనవాలు కనిపించలేదు.. ఈ ప్రమాదం జరిగి 30 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఇటీవల ఇసుక తవ్వకాల కోసం ఇరుకుల్ల వాగులో తవ్వుతుండగా.. ఓ పాత లారీ దొరికిందని పత్రికల్లో వార్తలు వచ్చాయి.

దీంతో కేశవపట్నంలో ఉంటున్న మృతుల కుటుంబసభ్యులు తహసీల్దార్ సహకారంతో జేసీబీతో తవ్వకాలు చేపట్టారు.. ఈ తవ్వకాల్లో లారీ విడిభాగాలు, మూడు మృతదేహాలకు సంబంధించిన పుర్రె, ఎముకల అవశేషాలు బయటపడ్డాయి. వాటికి ఉన్న బట్టల ఆధారంగా మృతులను కేశవపట్నానికి చెందిన దౌలత్‌ఖాన్, ముక్దుంఖాన్‌గా గుర్తించారు.. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు... కాగా ఇదే ప్రమాదంలో గల్లంతైన కటిక శంకర్, మరో మృతుడు వెంకటస్వామి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు..