డాక్టర్ శ్రవణ్ దాసోజు.. ఈ పేరు వినగానే అద్భుతమైన వాదనా పటిమ ఉన్న తెలంగాణ బిడ్డ అని ఠక్కున చెబుతారు. ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో గొప్ప వాదనా పటిమ ఉన్న నాయకుడు. అంతేకాదు ఏ సబ్జెక్టు పై అయినా క్షుణ్నంగా అధ్యయనం చేసి మాట్లాడతారు. తెలంగాణలో మేధావుల జాబితాలో తొలి వరుసలో ఉంటారు. ఎంతటి మేధా శక్తి ఉన్నా.. ఎంతటి వాదనా పటిమ ఉన్నా.. ఎంతగా అధ్యయనం చేసే నాయకుడైనా ఏం లాభం.. ఆయన రాజకీయాల్లో నిలబడలేకపోతున్నారు. నిలబడలేకపోవడం కాదు.. నిలవడనివ్వడంలేదు. వెనుకబడిన కులం (బిసి)లో పుట్టినందున ఆయనను ఎల్లప్పుడూ వెనకకు నెట్టే ప్రయత్నమే చేస్తున్నారు.

తాజాగా డాక్టర్ శ్రవణ్ మీద సోషల్ మీడియాలో పెద్ద కుట్రే జరిగింది. ఆయనతో చర్చించే దమ్ము లేని వారు, ఆయనతో వాదనలో నెగ్గలేని వారు సోషల్ మీడియాలో దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఇది ఎవరి పని అయినా.. ఒక నాయకుడిని ఎదుర్కోలేక ఇలా చేయడం మాత్రం రాజకీయాల్లో తగదని పలువురు రాజకీయ వేత్తలు చెబుతున్నారు. తన అకౌంట్ హ్యాక్ చేసి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు.. కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులస్తుల పార్టీగా మారిపోయిందని పోస్టు పెట్టారు. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది.

డాక్టర్ దాసోజు శ్రవణ్ ముందుగా ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ మూతపడిన తర్వాత టిఆర్ఎస్ లో చేరి ఆ పార్టీకి సేవలందించారు. కానీ దాసోజు ను చివరి నిమిషంలో టిఆర్ఎస్ లో అవమానించారన్న ప్రచారం ఉంది. అందుకే ఆయన టిఆర్ఎస్ ను వీడి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రయోజనాల కోసం, అధికార పార్టీ వైపల్యాల మీద మాట్లాడుతూ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోశిస్తున్నారు దాసోజు. కానీ ఆయనను ఎదుర్కోలేకనే పనిగట్టుకుని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఆయన పేరు మీద చెత్త పోస్టు ఉంచారని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

తనపై సోషల్ మీడియాలో జరిగిన కుట్రపై శ్రావణ్ భగ్గుమన్నారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిసి నాయకుడినైనందుకే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ దాసోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమేనని డాక్టర్ శ్రవణ్ ఏషియానెట్ కు చెప్పారు.