సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ తెగబడుతున్నారు. ప్రముఖుల అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఓ కలెక్టర్ వీరి బారిన పడ్డ సంఘటన నిజామాబాద్ లో కలకలం రేపింది.

నిజామాబాద్‌‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పేరుతో గుర్తు తెలియని వ్యక్తలు నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచారు. బంధువులు ఆసుపత్రిలో ఉన్నారంటూ ఎనిమిది వేల రూపాయలు పంపాలని సంబంధిత ఫేస్‌బుక్‌ నుంచి మెసేజ్‌లు చేశారు. 

ఈ విషయంపై అప్రమత్తమైన కలెక్టర్‌ అసలు అది తన అకౌంట్‌ కాదని పేర్కొన్నారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా పంపవద్దని స్పష్టం చేశారు. ఈ అకౌంట్‌పై పోలీసులకు కలెక్టర్‌ ఫిర్యాదు చేశారు. 

ప్రముఖుల సోషల్‌ మీడియా ఖాతాలను హ్యక్‌ చేయడం, నకిలీ అకౌంట్‌లు సృష్టించి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు అడిగారనగానే డబ్బులు పంపకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.