వికారాబాద్: తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న చిన్నారిపై జాలి చూపాల్సింది పోయి సమాజం మానవత్వం లేకుండా వ్యవహరించింది.  అమ్మమ్మవారింట్లో వుంటున్న బాలికపై నిందలు వేసి ఆ పసి హృదయాన్ని గాయపర్చారు. దీంతో బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దెముల్  మండలం మంబాపూర్ కు చెందిన రేణుక(14)కు తల్లిదండ్రులు లేకపోవడంతో అదే గ్రామంలోని అమ్మమ్మవారింట్లో వుంటోంది. జడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది రేణుక. అయితే బాలికపై కొద్దిరోజులగా కొందరు పనిగట్టుకుని నిందలు వేస్తున్నారు. దీంతో బాలిక తట్టుకోలేకపోయింది. 

ఈ నిందల నుండి బయటపడాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గమని భావించిన రేణుక అమ్మమ్మకు ఓ సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. " అమ్మమ్మా నన్ను  క్షమించండి.... నాపై వేసిన నిందలు భరించలేకే చనిపోతున్నాను'' అంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొంది రేణుక. 

బాలిక ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాలిక  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.