ఖమ్మం: 13 ఏళ్ల బాలిక పై లైంగిక దాడికి యత్నించి... ఆమె ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన అతి దారుణంగా హతమార్చిన దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితమే ఈ దారుణం జరగ్గా బాలిక హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఇటీవలే మృతిచెందింది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి సంచలన విషయమొకటి ఆలస్యంగా బయటపడింది. 

మృతురాలి తండ్రి పల్లెగూడెం గ్రామానికే చెందిన ఓ వ్యక్తి వద్ద అవసరాల నిమిత్తం కొంత నగదును అప్పుగా తీసుకున్నాడు. గడువు ముగిసినా తీసుకున్న నగదు తిరిగివ్వకపోవడంతో అప్పిచ్చిన వ్యక్తి దారుణంగా వ్యవహరించాడు. అప్పు కింద బాలికను ఖమ్మం పట్టణంలోని ముస్తాఫానగర్ లో నివాసముండే అల్లం సుబ్బారావు ఇంట్లో పనికి పెట్టాడు. 

read more   ఖమ్మం ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్, విచారణకు ఆదేశం

ఈ క్రమంలో రాత్రి అదే ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సుబ్బారావు కుమారుడు అత్యాచారయత్నం చేశాడు. ఇందుకు బాలిక ప్రతిఘటించడంతో ఎక్కడ ఈ విషయం బయటపడుతుందో అని భయపడిన ఆమెపై హత్యాయత్నం చేశాడు. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించాడు. ఇలా 70శాతం శరీరం కాలిపోవడంతో యువతిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి, హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ తో పాటు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.  

తమ కూతురు మృతికి అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా కారణమేనని బాలిక తల్లిదండ్రులు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు... తాజాగా అప్పిచ్చిన వ్యక్తిపై కూడా బాధిత కుటుంబం ఫిర్యాదు చేయగా అతడిపైనా కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.