హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను పబ్‌లో పార్టీకి పిలిచిను యువకులు వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను పబ్‌లో పార్టీకి పిలిచిను యువకులు వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాలు.. జూబ్లీహిల్స్‌లోని అమ్నీసియా & ఇన్సోమ్నియా పబ్‌లో శనివారం (మే 28) బాలిక స్నేహితులు పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి 17 ఏళ్ల బాధిత బాలిక, ఆమె మరికొందరు స్నేహితులతో కలిసి హాజరైంది. అయితే పార్టీ నుంచి ఆమె స్నేహితులతో కలిసి బయటకు వచ్చింది. 

అప్పుడు బాధిత బాలిక మెర్సిడెస్‌ వాహనంలో ఎక్కింది. అందులో ఆమె స్నేహితులు కొందరు ఎక్కారు. ఆ వెనకాలే ఇన్నోవా కారులో మరికొందరు ఎక్కారు. అయితే బాలికతో పాటు వాహనంలో ఉన్న వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమె మెడపై కూడా గాయపరిచారు. అనంతరం బాలిక వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. 

ఈ విషయంపై బాలిక తండ్రి ఫిర్యాదు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వారిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బాధిత మాట్లాడాల్సి ఉందన్నారు. పార్టీ కోసం మైనర్లను లోనికి ప్రవేశించడానికి పబ్ యాజమాన్యం ఎలా అనుమతించింది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇక, బాలిక తండ్రి మంగళవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన కుమార్తె ఇంకా షాక్‌లో ఉందని, విషయాలను స్పష్టంగా వివరించలేకపోయిందని చెప్పారు. అయితే మైనర్లను పబ్‌లోకి ఎలా అనుమతించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పలు సందర్భాల్లో నగరంలోని పబ్ నిర్వాహకులు మైనర్లను నిబంధనకు విరుద్దంగా పబ్‌ల్లోకి అనుమతిస్తున్న ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీచేసిన, చర్యలు తీసుకన్నా పబ్‌ల తీరు మారడం మారడం లేదు.