పని మీద ఇంట్లో నుంచి ఉదయం బయటకు వెళ్లిన బాలిక..  సాయంత్రానికి బావిలో శవంగా తేలింది. బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బావిలో పడేసి ఉంటారని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి తండా పంచాయతీ పరిధిలోని నాగులమ్మ తండాలో చోటుచేసుకోగా... ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తండాకు చెందిన బాలిక (16) బుధవారం ఇంట్లో నుంచి ఉదయం వెళ్లగా.. సాయంత్రం వ్యవసాయ బావిలో శవమై తేలింది. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం  అనంతరం నాగులమ్మ తండాకు తరలించారు.

అయితే బాలికను ఇద్దరు వ్యక్తులు హత్య చేసి బావిలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తండా వాసులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అనుమానితులపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు, బంధువులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గౌస్‌ మాట్లాడుతూ బాలిక మృతిపై పోస్టుమార్టం నివేదిక రాగానే అనుమానితులను విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విమరించారు.  అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో అంత్యక్రియలను పూర్తి చేయించారు.