నిజామాబాద్‌ : స్నేహితురాలికి ఐలవ్ యూ బంగారం అని మెసేజ్ పెట్టడమే ఆమె పాలిట శాపంగా మారింది. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ చిన్నారి ఆ మెసేజ్ కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామంలో చోటు చేసుకుంది. 

ఇక వివరాల్లోకి వెళ్తే నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం నయేగావ్ గ్రామానికి చెందిన సాయన్న తన భార్య ముగ్గరు కుమార్తెలతో కలిసి బతుకు దెరువు కోసం డొంకేశ్వర్ గ్రామానికి వచ్చేశాడు. అక్కడ ఓ రైతు వద్ద పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

సాయన్న రెండో కుమార్తె లలిత(15)  స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే, శనివారం తన క్లాస్‌మేట్‌ అయిన నికాల్‌పూర్‌ గ్రామానికి చెందిన పల్లవికి ఫోన్‌లో  ఐలవ్‌ యు బంగారం అని మెస్సేజ్‌ పెట్టింది.

ఐలవ్ యూ బంగారం అనే మెసేజ్ చూసి కంగారుపడ్డ పల్లవి ఆ మెసేజ్ ను తండ్రి హన్మంత్ కు చూపించింది. దాంతో హన్మంత్‌ మరో ఇద్దరిని తీసుకుని డొంకేశ్వర్‌లోని లలిత ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశాడు. మెసేజ్ ఎందుకు పెట్టావని నిలదీశాడు. పోలీసు కేసు పెడతానని హెచ్చరించి వెళ్లిపోయాడు. 

దాంతో తీవ్రమనస్థాపానికి గురైన లలిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చుట్టపక్కల గాలించినా ఆయూకీ లభించలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని మంచినీటి బావిలో శవమై లలిత కనిపించడాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆర్మూర్ సీఐ విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.