సొంత మేనమామకి ఓ ఎనిమిదేళ్ల బుడతడు నడిరోడ్డుపై చుక్కలు చూపించాడు.  రోడ్డు మధ్యలో మేనమామను పట్టుకొని అతనెవరో నాకు తెలీదంటూ ఏడుపు లంకించుకున్నాడు. రోడ్డుపై చూసినవారంతా అతను బాలుడిని కిడ్నాప్ చేస్తున్నారేమో అనుకున్నారు. పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  అంబర్ పటేలోని పటేల్ నగర్ కి చెందిన మహిళకు భర్త లేడు. దీంతో కుమారుడు కార్తీక్(8) తో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. ఆమె దుకాణంలో పనిచేస్తూ కుమారుడిని చదివిస్తోంది.  పటేల్ నగర్ లో ఉంటున్న ఆమె కాచిగూడలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది. 

Also Read తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టివేత, 12 మంది అరెస్ట్...

కాగా కార్తీక్‌ ప్రేమ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. లత ప్రతిరోజు కార్తీక్‌ను ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరుల వద్ద వదిలి షాపుకు వెళ్తుంది. రోజులాగే ఆదివారం కూడా ఆమె తన కుమారుడు కార్తీక్‌ను సోదరుడిని ఇంటి వద్ద విడిచి వెళ్లింది.
 
అయితే కార్తీక్‌ మామ ఆశ్విన్‌ కార్తీక్‌కు కటింగ్‌ చేయించడానికి ద్విచక్రవాహనంపై కాచిగూడకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో ఇంటికి త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో దగ్గర దారి గుండా వెళ్లాలని ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లాడు. అయితే తన మేనమామ తనను వేరే మార్గం నుంచి తీసుకెళ్లడంతో కార్తీక్‌ బోరునవిలపించాడు. 

దీంతో స్థానికులు అనుమానంతో విషయం అడగగా ఈయన ఎవరో తనకు తెలియదని వారికి చెప్పాడు. దీంతో వారు బాలుడిని అతడు కిడ్నాప్‌ చేస్తున్నాడని భావించి దేహశుద్ధి చేసి అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. అంబర్‌పేట పోలీసులు కార్తీక్‌ను విచారించగా ఆయన తన మేనమామ ఆశ్విన్‌ అని వారికి చెప్పాడు.

 కార్తీక్‌ తల్లి లతతోఫోన్‌లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. కార్తీక్‌ వారి అల్లుడే అని నిర్ధారించుకున్న పోలీసులు ఆ బాలుడిని తనమేనమామతో ఇంటికి పంపించారు. కాగా మేనల్లుడు చేసిన పనికి అశ్విన్ కి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి.