Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ కక్ష సాధింపు చర్యలు.. కేసీఆర్‌పై కుట్రలో భాగంగానే..: కవితకు ఈడీ నోటీసులపై మంత్రుల రియాక్షన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.  అయితే కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు.. కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

ministers reaction on ed notice to mlc kalvakuntla kavitha
Author
First Published Mar 8, 2023, 11:45 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 9వ తేదీన ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అయితే కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు.. కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని  కవితకు నోటీసులు జారీ చేశారని మంత్రి పువ్వాడ  అజయ్ ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కవితకు నోటీసులు ఇవ్వడం  దుర్మార్గమని మండిపడ్డారు. మహిళలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో దీన్నిబట్టి అర్థమవుతుందని అన్నారు. 

మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం బీజేపీ కుట్ర అని ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఆడబిడ్డల కన్నీళ్లు  చూస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. 

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.  మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే కేసీఆర్‌పై కుట్రలో భాగంగానే కవితకు ఈడీ నోటీసులని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో వివరిస్తామని తెలిపారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మొదటి నుంచి బీజేపీకి ఒక పాలసీ ఉందని.. ముందుగా నోటీసులు ఇస్తుందని.. భయపడకుంటే అరెస్ట్ చేస్తుందని.. ఆ తర్వాత జైలుకు పంపుతుందని అన్నారు. అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతూనే  ఉంటుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే తనకు ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తనుకు ఈడీ నోటీసులు ఇచ్చిందని  తెలిపిన కవిత.. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ప్రజా వ్యతిరేకత, అణచివేత చర్యలకు  తెలంగాణ  ఎప్పుడూ తలవంచదని చెప్పారు. ఇలాంటి చర్యలతో కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను లొంగదీసుకోవడం  కుదరదని బీజేపీ తెలుసుకోవాలని కవిత పేర్కొన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎండడగడుతూనే ఉంటామని చెప్పారు.  

జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి మార్చి 10న మా ధర్నాకు ముందు.. మార్చి 9న ఈడీ తనను పిలిచిందని అన్నారు. 9వ తేదీన  తనకు  ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు.  ఈడీ విచారణకు హజరు విషయమై  న్యాయ సలహ దీసుకుంటానని కవిత చెప్పారు. చట్టాన్ని గౌరవించి దర్యాప్తు సంస్థలకు తాను సహకరించనున్నట్టుగా కవిత పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios