తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్ మృతదేహంవద్ద మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం బిఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన ఆటాపాటతో తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపుతెచ్చిన సాయిచంద్ స్వరాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో సాయిచంద్ ఆడిపాడుతూ కార్యకర్తల్లో జోష్ నింపేవారు. ఇలా బిఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అతడు పార్టీలోని కీలక నాయకులతో మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పర్చుకున్నారు. దీంతో సాయిచంద్ హఠాన్మరణం మంత్రుల నుండి సాధారణ బిఆర్ఎస్ కార్యకర్త వరకు కన్నీరు పెట్టిస్తోంది. 

సాయిచంద్ మృతివార్త తెలిసిన వెంటనే మంత్రి హరీష్ రావు హాస్పిటల్ కు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనయిని మంత్రి కంటతడి పెట్టుకున్నారు. సాయిచంద్ మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేసారు. సాయిచంద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని బిఆర్ఎస్ నాయకులకు మంత్రి సూచించారు. 

ఇక మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా సాయిచంద్ మృతదేహాన్ని చూడగానే బోరున విలపించారు. గుర్రంగూడ గ్రామంలోని సాయిచంద్ నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళి అర్పించిన మంత్రి బాధలో వున్న కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలోనే సాయిచంద్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.

వీడియో 

ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుంటే తన ఇంటికి రావాలని సాయిచంద్ కోరాడని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. గుర్రంగూడలో కొత్తగా కట్టుకున్న తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలని కోరాడన్నారు. అయితే బిజీగా వుండటంతో మరోసారి వస్తానని చెప్పానని... కానీ ఇలా వస్తానని అనుకోలేదంటూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. 

Read More తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది... సాయిచంద్ మృతిపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దిగ్భ్రాంతి...

తెలంగాణ ఉద్యమంలోనే కాదు స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన అద్భుతమైన గాయకుడు సాయిచంద్ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అతడు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం వ్యక్తిగతంగా తననెంతో బాధిస్తోందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం సాయిచంద్ కుటుంబానికి అన్నివిధాలా అండగా వుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో సాయిచంద్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సాయిచంద్‌ను హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం సాయిచంద్‌ మృతదేహాన్ని గుర్రంగూడలోని నివాసానికి కుటుంబసభ్యులు తరలించారు.