నాగర్ కర్నూల్ లో జరిగిన బిజెపి మీటింగ్ లో సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వంపై జెపి నడ్డా చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
హైదరాబాద్ : బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా నాగర్ కర్నూల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ గులాములుగా మారిన తెలంగాణ బిజెపి నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ నే నడ్డా చదివారని అన్నారు. కానీ తెలంగాణ కేసీఆర్ అడ్డా అని నడ్డా గుర్తుంచుకోవాలని... నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ సుపరిపాలన అందిస్తుంటే అవినీతి, అక్రమాలు అంటూ మాట్లాడిన నడ్డాది నోరో లేక మోరో అర్థంకావడం లేదంటూ ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
బిజెపి డిల్లీ నేతలు తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ సిల్లీగా మాట్లాడటం ఆపాలని... వారిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు మంత్రి వేముల. కాబట్టి తప్పుడు ఆరోపణలతో బిఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడం ఆపి ప్రజల కోసం ఆలోంచించాలని అన్నారు. బిజెపి నాయకులు తెలంగాణకు వచ్చేముందు తెలంగాణకు కేంద్ర నుండి రావాల్సిన నిధులు ఇప్పించాలని మంత్రి సూచించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు చేయడం కాదు... దమ్ముంటే నిరూపించాలని వేముల అన్నారు.ఇప్పటికే పలుమార్లు కేంద్రం ఇచ్చిన నిధులు ఎలా ఖర్చుచేసామో వివరించినట్లు మంత్రి తెలిపారు. కానీ ప్రతిసారీ డిల్లీ నుండి రాష్ట్రానికి వచ్చే బిజెపి పెద్దలు కుక్క తోక వంకర అన్నట్లుగా మళ్లీ నిధుల దుర్వినియోగం అంటూ మాట్లాడుతుంటారని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకే బిజెపి నాయకులు బిఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై విషం చిమ్ముతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Read More తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు.. బాగుపడింది మాత్రం కేసీఆర్ కుటుంబమే : జేపీ నడ్డా
నిలువ నీడలేని పేదలకు గూడు కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంపైనా బిజెపి నేతలు ఆరోపణలు చేయడం దారుణమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చే నిధులతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నారని నడ్డా అనడం పచ్చి అబద్దమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇళ్ళకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
