Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు ముందస్తు ఆలోచన లేదు.. పూర్తి కాలం అధికారంలోనే : తేల్చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళతారంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదన్నారు.  రేవంత్, బండి సంజయ్‌లు ప్రజల్లో వుండి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 

minister vemula prashanth reddy gives clarity on early elections
Author
First Published Jan 22, 2023, 9:29 PM IST

బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదన్నారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మాకు ఇంకా తొమ్మిది నెలలకు పైగా సమయం వుందని ఆ కాలంలో రేవంత్, బండి సంజయ్‌లు ప్రజల్లో వుండి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఎంపీ అర్వింద్ తనను బేవకూఫ్ అన్నారని... ఆ మాటల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రశాంత్ రెడ్డి చురకలంటించారు. రాజకీయ లబ్ధి కోసం అర్వింద్ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డ్ తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి అర్వింద్ రైతులను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. మోటార్ సైకిల్ వున్న కుటుంబాలు ఆయుష్మాన్ భారత్‌కు అర్హులు కాదంటూ కేంద్రం ఎన్నో ఆంక్షలు పెట్టిందని ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్రంలో అమల్లో వున్న ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు మెరుగైందని మంత్రి స్పష్టం చేశారు. అర్వింద్‌ను మరోసారి ప్రజలు గెలిపించరని ప్రశాంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 

ఇకపోతే.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, చీటర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనకు, నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని  తాను ఉపఎన్నికలకు వెళ్లానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వుందని.. ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచిపోయారని ఆయన దుయ్యబట్టారు. కేవలం ఓట్ల కోసమే పెన్షన్లు, రైతు బంధు వంటి పథకాలు అందిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మే నెలలో ముందస్తు ఎన్నికలు తథ్యమేనని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. తన కొడుకు కేటీఆర్‌ను సీఎంగా చేయడం కోసమే ఈటల రాజేందర్‌ను కేసీఆర్ పార్టీలోంచి గెంటేశారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. పార్టీ పేరులో బీఆర్ఎస్ పేరు తీసేసి కేసీఆర్ తన గొయ్యి తానే తీసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్, తన కుటుంబం, తన బిడ్డల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారని.. తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 

Also REad: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, చీటర్.. మే నెలలోనే తెలంగాణ ఎన్నికలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

అంతకుముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే చివరి అసెంబ్లీ అన్నారు. నాగోబా దయతో రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని అన్నారు. అతిపెద్ద నాగోబా జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. గిరిజనులంటే కేసీఆర్‌కు చులకన అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప.. పేద ప్రజలను ఆదుకోవాలన్న సోయి కేసీఆర్ లేదని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. టీఆర్ఎస్ దివాలా  తీసిన కంపెనీ అని.. అందుగా బీఆర్ఎస్‌గా బోర్డు మార్చారని విమర్శించారు. మొన్నటి సభలో కనీసం జై తెలంగాణ అని కూడా కేసీఆర్ అనలేదని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios