హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సీఎల్పీ  నేత మల్లుభట్టివిక్రమార్క చేసిన సవాల్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. హైద్రాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపిస్తామని చెప్పారు. హైద్రాబాద్ నగరంలో ఒక్క వర్షానికి నగరంలో నెలకొన్న పరిస్థితులను కూడ చూస్తామని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ నగర అభివృద్ధిపై జరిగిన చర్చ సమయంలో టీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి మధ్య తీవ్ర చర్చ సాగింది. 

ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని టీఆర్ఎస్ ఇచ్చిన హామీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదలకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. పేదలకు రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని సీఎల్పీ నేత భట్టి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎల్పీ నేత భట్టి వ్యాఖ్యలపై ఖండించారు.

హైద్రాబాద్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపేందుకు తాను సిద్దంగా ఉన్నానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా ఆయన చెప్పారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి తాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

గురువారం నాడు ఉదయం హైద్రాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భట్టికి చూపేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఇంటి నుండి బయలుదేరారు. మల్లు భట్టి విక్రమార్కకు ఫోన్ చేస్తే ఆయన గాంధీ భవన్ లోని పార్టీ కార్యాలయంలో ఉన్నట్టుగా సీఎల్పీ నేత సహాయకుడు మంత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

మంత్రి బయల్దేరిన విషయాన్ని తెలుసుకొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గాంధీభవన్ నుండి తన ఇంటికి చేరుకొన్నారు. ఇంటికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. మంత్రి వెంట జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ తో పాటు ఇతర అధికారులు కూడ ఉన్నారు.

హైద్రాబాద్ నగరంలో రూ. 70 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక్క వర్షానికే నగరంలో ప్రజలు పడిన ఇబ్బందులను కూడ చూసేందుకు తాను సిద్దంగా ఉన్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

జియాగూడ, కట్టెలమండి, సీసీనగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్ లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు పరిశీలించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారులో భట్టి విక్రమార్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లారు.