నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్
క్యాసినో వ్యవహరంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.
క్యాసినో వ్యవహరంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు ఎలాంటి ఈడీ నోటీసులు అందలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.
‘‘ఈడీ నుండి నాకు నోటీసులు అందాయన్న రుమర్ తెలిసి నేను షాక్ అయ్యాను. నేను దానిని ఖండిస్తున్నాను. నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. అలాగే నాకు నోటీసు అందజేయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఏదైనా వార్తను ప్రదర్శించే ముందు వాస్తవాలను తనిఖీ చేయమని నేను అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను యువ రాజకీయవేత్తను ప్రజలకు నా వంతుగా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ధన్యవాదాలు’’ అని సాయికిరణ్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. ఇటీవల మంత్రి తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్‌లను కూడా విచారించింది. నేడు (సోమవారం) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్ కూడా ఈడీ ఎదుట విచారణకు హజరయ్యారు. హరీష్ బ్యాంక్ స్టేట్‌మెంట్లతో ఈడీ ఎదుట విచారణకు హజరైనట్టుగా తెలుస్తోంది.