Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం.. పార్టీలో కష్టపడేవారికి సముచిత స్థానం: మంత్రి తలసాని

టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని.. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో మరో 20 ఏళ్ల వ‌ర‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

MInister talasani srinivas yadav comments Greater trs Leaders meeting
Author
First Published Nov 27, 2022, 5:16 PM IST

టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని.. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో మరో 20 ఏళ్ల వ‌ర‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వ‌హించిన హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి తలసానితో పాటు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై చర్చించారు. గ్రేటర్ పరిధిలో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. 
టీఆర్ఎస్ కార్యకర్త అంటేనే గౌరవమైన పదవి అన్నారు. నామినేటెడ్ పోస్టులు రాలేదని కొందరు అసంతృప్తిలో ఉండటం సహజమేనని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి సముచిత స్థానం దక్కుతుందని అన్నారు.  

టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించడంతో బీజేపీలో భయాందోళన చెందుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటీ అధికారులు అనైతికంగా ప్రవర్తించారని మండిపడ్డారు. 

125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేకుండా పోతుందన్నారు. ప్రచారం జరుగుతున్నట్టుగా బీజేపీ అనేది రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాదని.. అది నీళ్ల మీద గాలి బుడగ అని విమర్శించారు. టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని.. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. టీఆర్ఎస్ లక్షలాది మంది సైన్యం ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నగరం టీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. 8 ఏళ్లలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్‌కు శ్రీరామరక్ష అని అన్నారు. అన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios