సుల్తాన్ పూర్ గండిచెరువులో విషపూరిత నీరు చేరడంతో చేపల మృతి దీనికి కారణమైన పరిశ్రమలపై చర్యలకు మంత్రి ఆదేశం
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ గండిచెరువులో విషపూరిత నీరు చేరడం వల్ల చేప పిల్లలు చనిపోయిన సంఘటనపై మత్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటిని వదిలి చేపల మృతి కి కారణమైన కంపెనీలను గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు.
చేపల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన సంగారెడ్డి జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో మాట్లాడి బాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 287 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉన్నఈ గండి చెరువులో పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్ధ జలాలు కలవడం వలనే 1.50 కోట్ల రూపాయల విలువైన చేపలు మరణించాయని అన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల మత్యకారులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. వారిని ఆదుకోడానికి ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటుందని హెచ్చరించారు
ఒక వైపు ప్రభుత్వం మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది మత్స్య కారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తోందని అన్నారు. అలాంటిది కలుషిత జలాలు చెరువులోకి వదిలి చేపల మృతికి కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది అని మంత్రి తలసాని హెచ్చరించారు.
