Asianet News TeluguAsianet News Telugu

వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటీ తరానికి స్ఫూర్తిదాయకం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Minister Srinivas Goud : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో నిజాం పాలకులను  ఎదురొడ్డి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. 

Minister Srinivas Goud Says Chakali Ilamma Struggle Is Inspiring KRJ
Author
First Published Sep 26, 2023, 11:47 PM IST

Minister Srinivas Goud: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని  రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పేదల కోసం కష్టపడిందని, భూస్వాములపై దాడి చేసిందని గుర్తు చేశారు.  ఆమెను ఎన్నో అవమానాలు చేసినప్పటికీ వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడిందన్నారు. చాకలి ఐలమ్మకు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు  బాసటగా నిలిచారని  తెలిపారు.  పేదల ధాన్యాన్ని భూస్వాములు కల్లాలపైనే దౌర్జన్యంగా దోచుకుంటుంటే.. తన ప్రాణాలకు తెగించి.. భూస్వాములకు ఎదురించిందనీ, పేదలకు న్యాయం చేసిందని అన్నారు.

ఐలమ్మ రజక కులంలో జన్మించినప్పటికీ అన్ని వర్గాల వారి కోసం పోరాటం చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నాగరికత  నేర్పే కులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యత  ఇస్తున్నదని అన్నారు .ఐలమ్మ స్ఫూర్తిగానే  తెలంగాణ వచ్చిందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ వస్తే సమానత్వం పెరుగుతుందని, తద్వారా మహిళలు ఉద్యోగ, విద్యా అవకాశాలతో పాటు, రాజకీయంగా ఎదుగుతారని తెలిపారు. 

రజక కులస్తుల సంక్షేమంలో భాగంగా తొలిసారి మహబూబ్ నగర్ లో వాషింగ్ మిషన్ల ద్వారా బట్టలు ఉతికే ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రజక సంఘానికి పాతపాలమూరులో ఎకరా స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రజక ఫంక్షన్ హాల్ కు త్వరలోనే నిధులు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్  శర వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అన్ని రంగాలలో ముందుకెళుతున్నదని, పాలమూరు- రంగారెడ్డి ద్వారా సాగునీరు వస్తున్నదని,జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ కే. నరసింహ, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు,ముదా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రజక సంఘం అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా  రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్ ,కౌన్సిలర్లు గోవిందు, కట్ట రవి కిషన్ రెడ్డి, వివిధ  కుల సంఘాల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios