ఆరోగ్యానికి మేలు చేసే ‘నీరా’ తాగాలంటూ సినీ హీరోలు ప్రచారం చేయరెందుకు? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఆరోగ్యానికి హానీచేసే కూల్‌డ్రింక్‌లు తాగాలంటూ సినీ హీరోలు  ప్రచారం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆరోగ్యానికి మేలు చేసే నీరా విక్రయాలు హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై రూ.10 కోట్లతో చేపట్టబోతున్నామని తెలిపారు. 

ఖమ్మంలో బీసీ సంక్షేమ భవనం పనులకు మంత్రి పువ్వాడతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈత, తాటివనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి తాటి నీరాతో పాటు తాటి ఉత్పత్తులు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.  గత పాలకులు కులవృత్తులను పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ కులవృత్తులకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.

మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఖమ్మంలో ఇందుకు ఐదెకరాల భూమి కేటాయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖమ్మంలో రూ.21.45 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. 

కాగా, ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో పంచాయతీరాజ్‌ ఉద్యోగుల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, అజయ్‌.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, సమస్యలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.