దేశ రక్షణ విషయంలో అనాలోచితంగా, అవివేకంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అగ్నిపథ్ పథకమని తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.  

హైదరాబాద్: పదవ తరగతి పాసైన యువకులు అగ్నిపథ్ పథకం ద్వారా దేశ సైన్యంలో చేరి నాలుగేళ్ల తర్వాత 12వ తరగతి పాసైనట్లు సర్టిఫికెట్ తో తిరిగి వెళ్ళవచ్చని కేంద్ర ప్రభుత్వ ప్రకటన సిగ్గుచేటని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  మండిపడ్డారు. యువకులను సైన్యంలోకి దేశ రక్షణ కోసం తీసుకుంటున్నారా... అప్రెంటీస్ షిప్ కోసం  తీసుకుంటున్నారా? అంటూ నిలదీసారు. దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదు... దేశ భవిష్యత్ కు, రక్షణకు అగ్నిపథ్ పథకం గొడ్డలిపెట్టని అన్నారు. అసలు అగ్నిపథ్ పథక రూపకల్పనే అనాలోచిత నిర్ణయమని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 

సైనిక బలగాల నియామకం విషయంలో  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. దేశ భద్రత విషయంలో కేంద్రం అనాలోచిత, అవివేక నిర్ణయాలు తీసుకోందని మండిపడ్డారు. 46 వేల మందిని 90 రోజులలో నియమిస్తామని... కేవలం రూ.30 వేల జీతం ఇచ్చి నాలుగేళ్లలో తొలగిస్తామనేది అర్దం లేని ఆలోచన అని మంత్రి అన్నారు.  

''బీజేపీ పాపం ముదిరి పాకానపడింది. మొన్న నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్నారు. నేడు అగ్నిపథ్ లాంటి నిర్ణయాలతో యువత ఉసురు పోసుకుంటున్నారు. నల్లధనం తెస్తాం... రూ.15 లక్షలు పేదల ఖాతాలలో వేస్తాం అని అమాయకుల ఓట్లు కొల్లగొట్టారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయం కొల్లగొట్టారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం అని రైతులను మోసం చేశారు'' అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 

''ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరు కింద కేంద్రం అమ్మేస్తోంది. మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుండి 7.83 శాతానికి పెంచారు. ఆకలిసూచిని 110 దేశాలలో భారత్ ను 101 స్థానంలో నిలపారు. ఇదీ మోదీ సుపరిపాలన'' అంటూ ఎద్దేవా చేసారు. 

''మోడీది అంతా మోసాల పాలన. ఈయన పాలనలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆందోళనలు సాగుతున్నాయి. ఇవి చూసయినా దేశప్రజలు , దేశ యువత జాగృతం కావాలి. యువత ఆగ్రహాన్ని గమనించి అయినా కేంద్రం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి'' అని మంత్రి కోరారు. 

''వేతనాలు, ఫించన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం తలాతోకాలేకుండా తీసుకున్న నిర్ణయమే అగ్నిపథ్. దీన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిరసన తెలుపుతున్న యువతపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పులలో ఒకరు మరణించడం, కొందరు గాయపడడం బాధాకరం. బాధిత కుటుంబానికి, గాయపడిన కుటుంబాలకు  కేంద్రం పరిహారం చెల్లించాలి. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రం బాధ్యత వహించాలి'' అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు.