Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు.. తెలంగాణ చరిత్ర ఆమెకు తెలియదు: మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Minister Satyavathi Rathod Slams governor tamilisai soundarajan Comments
Author
First Published Sep 8, 2022, 5:51 PM IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆమె ఓ గవర్నర్​లా కాకుండా రాజకీయ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి ఎవరు దూరమయ్యారో గవర్నర్​ తనకు తానే సమీక్షించుకోవాలని  అన్నారు. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసును ప్రదర్శించారని అన్నారు. గవర్నర్ తన పని తాను చేసుకోవాలని సూచించారు. 

ఆమె ప్రవర్తన తీరు ఒక గవర్నర్‌ లెక్క లేదని అన్నారు. కేసీఆర్ మహిళలకు ఇచ్చినంతా గౌరవం దేశంలో మరే ముఖ్యమంత్రి  ఇవ్వరని చెప్పారు. గవర్నర్ తమిళిసై స్థాయి మరిచిపోయి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.  గతంలో ఉన్న గవర్నర్లతో రాని సమస్య ఇప్పటి గవర్నర్‌తోనే ఎందుకు వస్తుందనేది ఆమె సమీక్షించుకోవాలన్నారు. రాజ్‌భవన్‌కు ఎప్పుడు వెళ్లాలన్నది, ఏ మీటింగ్ వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఇష్టమని చెప్పారు. ఎందుకు రాలేదని  శాసించే హక్కు గవర్నర్‌కు లేదన్నారు. రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా తయారు చేశారని ఆరోపించారు.

గవర్నర్ తన పరిధిని ధాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్ కు దూరం ఎక్కడ పెరగలేదని.. ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయని అన్నారు. గవర్నర్ తమిళిసై చేసిన చర్యల వల్లే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు దూరం పెరుగుతుందని అన్నారు. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా గవర్నర్‌కు ఏం పని అని వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్‌కు తెలియదని.. అందుకే విమోచనం అంటున్నారని అన్నారు. లేని సమస్యలను ఉన్నట్టు చూపడం  సమంజసం కాదని అన్నారు. గవర్నర్ గా ఉంటారో పార్టీ నేతగా వ్యవహరిస్తారో ఆమె తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం  ప్రశంసిస్తే.. గవర్నర్ మాత్రం ఇలా మాట్లాడం  కరెక్ట్ కాదని అన్నారు. గవర్నర్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. 

Also Read: రాజ్‌భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా?.. నిద్ర నటించే వాళ్లను ఏం చేయలేం: ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై

ఇక, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్.. ఆ వ్యవస్థను దిగజార్చే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. సదరన్ జోనల్ మీటింగ్ వెళ్తారా? లేదా? అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని అన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడమేమిటని ప్రశ్నించారు. గవర్నర్ మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడైనా చూపించగలరా అని ప్రశ్నించారు. 

గవర్నర్ తమిళిసై ఏమన్నారంటే..
తెలంగాణ ప్రభుత్వంపై  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరోక్ష‌ విమర్శలు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తాను బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడారు.  ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేదని అన్నారు. రాజ్ భవన్ విషయంలో అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికైనా ప్రజాప్రతినిధి అందుబాటులో లేకపోతే ప్రజలు ఎవరి దగ్గరకు వెళ్లాని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో ఎందుకు అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని ప్రాంతామా? అంటూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. 

తనతో రాష్ట్ర ప్రభుత్వానికి  వచ్చిన  ఇబ్బందేమిటని తమిళిసై ప్రశ్నించారు. తన మనో ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని చెప్పారు. సర్వీస్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి కరెక్ట్ కాదనే రిజెక్ట చేశానని చెప్పారు. ఆ విషయంలో నిబంధనల మేరకే వ్యవహరించానని తెలిపారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. తాను తెలంగాణ చరిత్ర చదివానని.. సెప్టెంబర్ 17న విమోచన అనే పదమే సరైనదని అన్నారు. 

సదరన్ కౌన్సిల్ సమావేశానికి సీఎం ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్.. విభజన సమస్యల పరిష్కారానికి అవకాశం వచ్చినా వినియోగించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. నిద్రపోయేవారిని లేపొచ్చని.. కానీ నిద్ర నటించేవారిని ఏం చేయలేం అని అన్నారు. రేపు మరో గవర్నర్ వచ్చినా ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. ఎట్‌హోమ్‌కు వస్తానని రాకపోవడం కరెక్టేనా? చెప్పాలని అడిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios