ప్రతి ఆదివారం పరిసరాల పరిశుభ్రతలో పది నిమిషాలు మీకోసం అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు. గార్డెన్ లో నీటి నిల్వలు లేకుండా చేసి, మొక్కల వద్ద మట్టిని తవ్వి మొక్కలు సజావుగా పెరిగేటట్లు గార్డెనింగ్ చేశారు.

ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

అనేక వ్యాధులకు చికిత్స కంటే నివారణ అత్యుత్తమమైందని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుకోవడమే కాకుండా, ఆర్ధికపరంగా కూడా జరిగే నష్టాన్ని నివారించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపును అందరూ పాటించి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆర్ధికంగా నష్టపోకుండా ఉండాలని సూచించారు. ముఖ్యంగా దోమలు పెరిగే అవకాశం ఉన్న నీటి నిల్వలు లేకుండా డ్రైడే పాటించాలని సత్యవతి అన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు చూపుతో మనం విజయవంతం చేసుకున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తెలంగాణలో కరోనా కట్టడికి చాలా ఉపయోగపడిందన్నారు. అనేక సీజనల్ వ్యాధులు పరిశుభ్రత లేకపోవడం వల్ల ప్రబలే అవకాశం వుందని సత్యవతి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల వారే కాకుండా వారి చుట్టుపక్కల వారికి కూడా మేలు చేసినవారవుతారని మంత్రి అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ రాకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, శానిటైజర్ తో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.