బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై విద్యాశాఖ  సోమవారం సమావేశం అయింది. ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు. 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై విద్యాశాఖ సోమవారం సమావేశం అయింది. ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళనలను విరమింపచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. బితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వైస్ ఛాన్స్‌లర్ నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసే అవకాశం ఉందనే తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. 12 డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా వస్తున్న రాజకీయ పార్టీల, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు క్యాంపస్‌లోని అనుమతించడం లేదు. ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులతో ప్రభుత్వం తరఫున పలుమార్లు సంప్రదింపులు జరిపిన ఫలితం లేకుండా పోయింది. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. 

గత అర్ధరాత్రి విద్యార్థులతో కలెక్టర్, ఆర్‌జీయూకేటీ డైరెక్టర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆందోళన విరమించాలని కలెక్టర్ సూచించారు. అయితే విద్యార్థులు మాత్రం మంత్రులు కేటీఆర్, సబితలతో రాత పూర్వక హామీ కావాలని పట్టుబట్టారు. దీంతో కలెక్టర్, అధికారులు అక్కడి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు యథావిధిగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇక,అంతకుముందు ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు సఫలమంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారిక ప్రకటన చేయగా.. చర్చలు విఫలమయ్యాయంటూ విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. 

ఇక, శనివారం బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులకు లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారని సబిత ఆవేదన వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని... విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ని నియమించామని.. ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ వెంకట రమణను ప్రభుత్వం మీ వద్దకు పంపిందని సబిత తెలిపారు. ఇది మీ ప్రభుత్వమని దయచేసి చర్చించాలని విద్యాశాఖ మంత్రి లేఖలో తెలిపారు. 

యూనివర్సిటీ సమస్యలు తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. ఏ వర్సిటీలో లేని విధంగా బాసరలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటీ ఉందని, ఈ కమిటీ, యూనివర్సిటీ కమిటీ చర్చించుకుని పరిష్కరించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. కరోనా వల్ల రెండేళ్లు సమస్యలు పరిష్కరించడంలో జాప్యమయిందని ఆమె పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ ప్రతిష్టకు భంగం కలగవద్దని సబిత ఇంద్రారెడ్డి విద్యార్ధులకు సూచించారు.