సారాంశం

ఆర్ధిక ఇబ్బందులు ఓ కుటుంబంలో  విషాదాన్ని నింపాయి.  అప్పుల కారణంగానే  ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  వద్ద ఎస్కార్ట్  విభాగంలో విధులు నిర్వహిస్తున్న  ఎఆర్ ఎఎస్ఐ  ఫజల్ అలీ  ఆదివారంనాడు ఉదయం  ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే  ఫజల్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడని  పోలీసులు చెబుతున్నారు.

కూతురి ముందే తండ్రి  ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ ఉదయం హైద్రాబాద్ శ్రీనగర్  కాలనీలో ఓ హోటల్ వద్ద  ఫజల్ అలీ  ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో చేరిన కొద్ది క్షణాలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  వెస్ట్ జోన్ డీసీపీ  జోయల్ డేవిస్  పరిశీలించారు. ఆత్మహత్య చేసుకునే ముందే  కొడుకుకు  ఫజల్ అలీ ఫోన్ చేశారని  సమాచారం. ఫజల్ అలీ మృతదేహన్ని పోలీసులు  పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అప్పులకు సంబంధించిన పత్రాలు కూతురికి అప్పగించి  ఫజల్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు.  అప్పు చెల్లించిన కూడ లోన్ రికవరీ ఏజంట్లు వేధింపులకు పాల్పడుతున్నందునే ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  పోలీసులు  అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు.

గతంలో  కూడ విధుల్లో ఉన్న  పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి.  ఈ ఏడాది  అక్టోబర్  5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో  కుటుంబ సభ్యులను హత్యచేసి  కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన  కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగా ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు.

 శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో  గత ఏడాది  మే 16న  కానిస్టేబుల్  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  గత ఏడాది  జనవరి  10న,  ఖమ్మంలో  ఏఆర్ కానిస్టేబుల్  లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నాడు.  కొద్దిగంటల్లో నిశ్చితార్ధం చేసుకోవాల్సిన  కానిస్టేబుల్ ఆశోక్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

2021  నవంబర్ 4న  ఓ మహిళా కానిస్టేబుల్  ఆత్మహత్య చేసుకున్నారు.  కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా  పోలీసులు నిర్ధారించారు.

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు

జీవితంలో  సమస్యలకు  ఆత్మహత్యలు పరిష్కారం కావని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్యనైనా  ధైర్యంగా ఎదుర్కోవాలని సైక్రియాటిస్టులు సూచిస్తున్నారు. జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.