తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తనను తప్పించాలని పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తనను తప్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల సీబీఐ కోర్టు ఓబుళాపురం మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేసిన సబితా ఇంద్రారెడ్డి.. సీబీఐ కోర్టు ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణపై స్టే కోరారు.
ఇక, ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సబితా ఇంద్రా రెడ్డితో పాటు మరికొందరు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌లను గతేడాది అక్టోబర్ 17న సీబీఐ కోర్టు కొట్టివేసింది. సంబంధించి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు పలువురిపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు గతేడాది అక్టోబర్ 28న అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మిపై న్యాయస్థానం ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. ఇక, గనులు, భూగర్భ శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గనుల శాఖ మాజీ కార్యదర్శి బీ కృపానందం, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) మేనేజింగ్ డైరెక్టర్ బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి వ్యక్తిగత సహాయకుడు మెహఫుజ్ అలీఖాన్‌లపై కూడా సీబీఐ కోర్టు అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే సబితా ఇంద్రా రెడ్డి సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
