వుంటే వుండండి, పోతే పోండి.. వ్యక్తులపై బీఆర్ఎస్ ఆధారపడదు, సస్పెన్షన్ తప్పదు : పొంగులేటీకి పువ్వాడ కౌంటర్
మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డికి కౌంటరిచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . దమ్ముంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని మంత్రి సవాల్ విసిరారు. వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేస్తామని పువ్వాడ తేల్చిచెప్పారు.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. తన వాళ్లను కాదని, దమ్ముంటే తను సస్పెండ్ చేయాలంటూ పొంగులేటీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దమ్ముంటే పొంగులేటీ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. పార్టీలో వుంటే వుండండి లేదంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయండి అంటూ మంత్రి కౌంటరిచ్చారు. వ్యక్తులపై బీఆర్ఎస్ ఆధారపడదని పువ్వాడ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జెండా వదలడమంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్లేనని అజయ్ కుమార్ అన్నారు. పార్టీ బీ ఫాం తీసుకుని, వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేస్తామని పువ్వాడ తేల్చిచెప్పారు.
కాగా.. బీఆర్ఎస్ నుంచి తన అనుచరులను సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించారని.. వాళ్ల గెలుపు కోసం తనను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారని.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన బొమ్మ ఎందుకు వేశారని ప్రశ్నించారు. తన అనుచరుల అభీష్టం మేరకే పార్టీ మారుతున్నట్టుగా చెప్పారు.
Also REad: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. అనుచరుల కోరిక మేరకే పార్టీ మార్పు: మాజీ ఎంపీ పొంగులేటి
ఇదిలావుండగా.. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో మాజీ ఎంపీ పొంగులేటి వర్గంపై పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాబు చేసిన వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. వీరిలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ , వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్ సహా మరో 18 మంది వున్నారు. బీఆర్ఎస్ పెద్దలతో పొంగులేటికి గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మండల స్థాయి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఐదు మండలాలకు చెందిన నేతలతో శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం.. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేసింది.