బెజవాడలో కరకట్ట ప్రజల కష్టాలు తీర్చింది జగన్ ఒక్కరే : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కృష్ణలంక కరకట్ట రక్షణ గోడ నిర్మాణానికి ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కానీ సీఎం జగన్ ముందుకు వచ్చారు..నిర్మాణాలు చేపట్టారని ప్రశంసించారు.
విజయవాడలో స్థలం దొరకడం కష్టంగా మారిందని.. అయినప్పటికీ రూ.20.34 కోట్లతో మూడు ఇండోర్ సబ్ స్టేషన్ లు నిర్మించామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్‌లోని కనకదుర్గా నగర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్‌లను ఆదివారం రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ద్వారా 40 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.
గతంలో కృష్ణలంక కరకట్ట రక్షణ గోడ నిర్మాణానికి ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయలేదని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. కానీ సీఎం జగన్ ముందుకు వచ్చారు..నిర్మాణాలు చేపట్టారని ప్రశంసించారు. కరకట్ట నిర్మాణం కోసం కోట్లు కేటాయించి అక్కడి ప్రజల సమస్యని పరిష్కారం చేశారని పెద్దిరెడ్డి చెప్పారు. కష్టపడి పనిచేసే నాయకుడు దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేవినేని అవినాష్ ను ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
ఇకపోతే.. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామన్నారు. మరే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఎన్నికల హామీలు అమలు చేసిన చరిత్ర లేదని మంత్రి అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు చేసే ఆరోపణల్లో నిజం లేదన్నారు.