Asianet News TeluguAsianet News Telugu

నా కుమారుడిని ఐటీ అదికారులు కొట్టి ఉంటారు, అందుకే ఛాతినొప్పి.. మల్లారెడ్డి సీరియస్..

ఐటీ అధికారులు తనిఖీల సమయంలో తన కొడుకును కొట్టి ఉండొచ్చని.. దీనివల్లే ఛాతినొప్పి వచ్చిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 

Minister Malla Reddy angry with IT officials Over his sons chest pain
Author
First Published Nov 23, 2022, 9:12 AM IST

హైదరాబాద్: ఐటి అధికారులపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వారితో ఆయన వాగ్వివాదానికి దిగారు. కుమారుడు మహేందర్ రెడ్డిని చూసేందుకు ఆయన ఆస్పత్రికి వెళ్లారు. తన కుమారుడిని కొట్టి ఉంటారని, భయపెట్టి ఉంటారని మల్లారెడ్డి ఆరోపించారు. తామేమైనా స్మగ్లింగ్ చేస్తున్నామా అని ప్రశ్నించారు. తన కొడుకును కొట్టి ఉంటారని, అందుకే ఆస్పత్రి పాలయ్యారని ఆయన అన్నారు. తన కొడుకును వేధిస్తున్నారని ఆయన అన్నారు. తామేమైనా దొంగ వ్యాపారాలు చేస్తున్నామా అని ఆయన అడిగారు. 200 మంది అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై, తన బంధువులపై ఐటి దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. 

బిజెపి రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాను ఇప్పుడు భూములు ఏమీ కొనడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడిని ఆస్పత్రిలో చూడనివ్వడం లేదని, తమ వద్ద దొరికిందేమీ లేదని, తన ఇంట్లో ఆరు లక్షల రూపాయలు మాత్రమే గుర్తించారని మల్లారెడ్డి  అన్నారు. సిఆర్ఫిఎఫ్ సిబ్బంది తన కుమారుడిని ఛాతీపై కొట్టారని ఆయన ఆరోపించారు. తాము ఇంజనీర్లను తయారు చేస్తున్నామని, దొంగతనత చేయడం లేదని ఆయన అన్నారు. తామేమైన దాచుకుంటున్నామా, తామేమైనా క్యాసినో ఆడిస్తున్నామా అని ఆయన మండిపడ్డారు. మంగళవారం ఉదయం నుంచి మల్లారెడ్డికి చెందిన ఆవరణల్లోనూ ఆయన బంధువులూ సన్నిహితుల ఇళ్లలోనూ ఐటి సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. ఆదాయం పన్ను (ఐటి) అధికారులు మంగళవారం నుంచి సోదాలు చేస్తున్నారు. దీంతో మహేందర్ రెడ్డి కొంపల్లిలోని ఇంట్లోనే ఉండిపోయారు. ఛాతి నొప్పి రావడంతో మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. 

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి.. ఆస్పత్రికి తరలింపు...

మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించి అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటి అధికారులు మల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సంతోష్ రెడ్డి ఇంటి తలుపులు తీయలేదు. దీంతో అధికారులు ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. పెద్ద యెత్తున సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. 

మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనే కాకుండా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలను అధికారులుపరిశీలిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు చేస్తున్న వ్యక్తుల ఇళ్లలోనే మంగళవారం రాత్రి అధికారులు పడుకున్నారు. 

సోదాల్లో అధికారులు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కూడా స్వాధీనం చేసుకున్నారు. మంగళవారంనాడు అధికారులు నాలుగున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డికి సన్నిహితుడైన జైకిషన్ నివాసంలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.

తెలంగాణ మంత్రి  మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో మంగళవారం ఐటీ అధికారులు రూ. 2 కోట్ల విలువైన నగదును సీజ్ చేశారు. సుచిత్రలో  నివాసం ఉంటున్న త్రిశూల్ రెడ్డి పలు  కాలేజీలను నిర్వహిస్తున్నారని సమాచారం. 

మంత్రి మల్లారెడ్డి  ఆయన సోదరుడు గోపాల్ రెడ్డి, అల్లుడు  రాజశేఖర్ రెడ్డి , కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు  కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కుటుంబానికి చెందిన 14  విద్యాసంస్థల్లో కూడా ఐటీ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి  సమక్షంలోనే ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు  లాకర్లను గుర్తించారు. లాకర్లను  తెరిపించేందుకు ఓ వ్యక్తిని  తీసుకువచ్చి లాకర్లను తెరిపించారు. 

ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామునుంచి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లా రెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఆయన, అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు.  మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీ లకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios