హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో ఏ క్షణమైనా గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా సిద్దంగా ఉండాలని ఆయన కోరారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నగరానికి చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికలకు ఇప్పటి నుండే పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆయన కోరారు. 

గ్రేటర్ పరిధిలోని 15 మంది కార్పోరేటర్ల పనితీరు బాగా లేదని మంత్రి తేల్చి చెప్పారు. 15 మంది కార్పోరేటర్లు తమ పనితీరును ఇప్పటికైనా మార్చుకోవాలని ఆయన సూచించారు.

కార్పోరేటర్లకు ఏమైనా సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పాలని ఆయన కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడ  ప్రజా ప్రతినిధులు సిద్దంగా ఉండాలని ఆయన కోరారు.తమ పరిధిలోని కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి సూచించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలకవర్గం సమావేశం ముగియనుంది. దీంతో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ దఫా గతంలో కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లు కూడ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సిద్దంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.