తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు ప్రసంగం విషయంలో తాత, తండ్రులను మరపిస్తున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్న ఈ కుర్రాడు గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను ఆధునికీకరించడంతో తన వంతు సాయం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్నారు. గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను ఆధునికీకరించడంతో తన వంతు సాయం చేశారు. తాజాగా బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు తొలిసారి వచ్చిన్నప్పుడు, ఇక్కడి పరిస్ధితిని చూసి తాను కంటతడి పెట్టినట్లు హిమాన్షు చెప్పారు. 

ఆడపిల్లలకు సరైన బాత్‌రూమ్‌లు లేవని, చివరికి మెట్లు కూడా సరిగా లేవని.. తన జీవితంలో అలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. రాళ్ల మధ్యలో పిల్లలు ఆడుకుంటున్నారని.. హెడ్ మాస్టర్ గదిలోనే క్లాస్ రూం, స్టోర్ రూమ్ వుండటం చూసి షాకయ్యానని హిమాన్షు గుర్తుచేసుకున్నాడు. ఈ పరిస్ధితిని బాగు చేయాలనే ఉద్దేశంతోనే తాను స్కూలు రూపు రేఖలను మార్చాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా తాను సేకరించిన నిధులతో ఆధునికీకరణ పనులను చేపట్టినట్లు హిమాన్షు వెల్లడించారు. తొలుత రూ.40 లక్షల ఫండ్, ఆపై సీఎస్ఆర్ ఫండ్ కూడా కంట్రిబ్యూట్ చేశారని ఆయన తెలిపారు. 

ALso Read: సీఎం కేసీఆర్ మనవడి పెద్ద మనసు.. రూ. కోటితో కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల..

తాను పబ్లిక్‌లో మాట్లాడటం ఇదే తొలిసారని.. కొంచెం భయంగా వున్నప్పటికీ , తన కుటుంబం ముందు మాట్లాడుతున్నట్లుగానే వుందని హిమాన్షు చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు కేశవనగర్ స్కూల్‌ను సందర్శించానని హిమాన్షు పేర్కొన్నారు. చివరికి రాత్రిపూట కూడా వచ్చిన పనులు ఎలా జరుగుతున్నాయో చూశానని.. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయినా , మా క్లాస్ కో ఆర్డినేటర్‌ సలహా మేరకు ఇక్కడికి వచ్చానని హిమాన్షు వెల్లడించారు. కేసీఆర్ మనవడిని కాబట్టి సాదాసీదాగా చేస్తే బాగుండదని.. ఏదో కొత్తగా చేయాలని అనుకున్నానని అందుకే ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు. 

తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పది వేల మొక్కలు నాటామని.. అయినా అది తనకు సంతృప్తినివ్వలేదని బెంచ్ మార్క్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నామని హిమాన్షు పేర్కొన్నారు. పేదరికాన్ని రూపుమాపేది చదువు మాత్రమేనని తాతయ్య చెబుతూ వుండేవారని, చదువులో గ్రేడ్ తగ్గినా వందమందికి మేలు చేయాలని నాన్న గారు కూడా అనేవారని హిమాన్షు చెప్పారు. వారిద్దరి ఆశీస్సులతో కేశవనగర్ స్కూల్‌లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని.. ఇక్కడ చదివే పిల్లలంతా పేదవారని.. వీళ్లు జీవితంలో బాగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులోనే మీ అందరికీ తోడుగా వుంటానని తనకు సహకరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే గాంధీకి హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు.