మసీదులు తవ్వడం కాదు.. దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా: బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్‌ను పరిచయం చేసింది కేసీఆరేనని.. తండ్రి లాంటి కేసీఆర్‌ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్‌ను పరిచయం చేసింది కేసీఆరేనని.. తండ్రి లాంటి కేసీఆర్‌ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని, తండ్రిలాంటి వ్యక్తిని పట్టుకొని అరిష్టమని మాట్లాడుతున్నరు ఈటలకు ఇది తగునా అని ప్రశ్నించారు.
ఎవరి పాలన దేశానికి అరిష్టదాయకమో ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు.. వేశారా? అని అడిగారు. హుజూరాబాద్‌లో, దేశంలో ఎవరికైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మోదీని దేవుడు అంటున్నారనీ.. మోదీ ఎవరికి దేవుడని ప్రశ్నించారు. 30 ఏళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయాయని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా పెట్రోల్, గ్యాస్ ధరలు మండిపోతున్నాయని అన్నారు. ఇందుకేనా నరేంద్ర మోదీ దేవుడు? అని ప్రశ్నించారు.
అదే సమయంలో బండి సంజయ్‌కు కేటీఆర్ సవాలు విసిరారు. తెల్లారిలేస్తే సొల్లుమాటలు చెబుతూ కేసీఆర్ ను తిట్టడంకాదని.. హుజురాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో 14 నెలల్లో ఈటల రాజేందర్, బండి సంజయ్ చిల్లిగవ్వ పనిచేయలేదని విమర్శించారు. బండి సంజయ్‌కు గుజరాతీల చెప్పుల మోసే సోకు ఉండొచ్చని సెటైర్లు వేశారు. బండి సంజయ్ మాట్లాడితే హిందూస్థాన్, పాకిస్థాన్ అని అంటారని మండిపడ్డారు. మసీదులు తవ్వడం కాదు.. దమ్ముంటే హుజూరాబాద్‌లో కాలువలు తవ్వుదాం, కొత్త పరిశ్రమలు పెట్టేందుకు పునాదులు తవ్వుదాం అంటూ సవాలు విసిరారు.