మానవత్వం చాటుకున్న కేటీఆర్... సాటి మనుషులను కాపాడేందుకు మంత్రి తాపత్రయం
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను కాపాడి మానవత్వం చాటుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి మానవత్వం చాటుకున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ వ్యవహారాలతో పాటు తన మంత్రిత్వ శాఖ పనులు, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో నిత్యం బిజీబిజీగా గడిపే కేటీఆర్ సాటిమనిషుల ప్రాణాల కాపాడేందుకు వాటన్నింటిని పక్కనపెట్టారు. రోడ్డు ప్రమాదానికి గురయి గాయాలతో పడివున్న వారిని చూసి కేటీఆర్ మనసు చలించింది. దీంతో దగ్గరుండి వారికి ప్రథమచికిత్స అందేలాచూసిన కేటీఆర్ తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో హాస్పిటల్ కు తరలించారు.
వివరాల్లోకి వెళితే... గత ఆదివారం మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ వెళుతున్న దారిలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సాయంతో కారులోంచి బయటకు వచ్చిన క్షతగాత్రులు గాయాలతో రోడ్డుపై వుండగా ఇదే సమయంలో కేటీఆర్ కాన్వాయ్ అటువైపు వచ్చింది. గాయాలతో బాధపడుతున్నవారిని చూసి చలించిపోయిన కేటీఆర్ తన బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనపెట్టి వెంటనే కాన్వాయ్ ను ఆపారు. కారు దిగి క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి తన వెంట వుండే వైద్యుడితో వారికి ప్రథమచికిత్స చేయించారు. తర్వాత తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
మంత్రి కేటీఆర్ చొరవతో ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం తప్పింది. రాజకీయాలను పక్కనబెట్టి సాటి మనిషుల ప్రాణాలు కాపాడి ప్రజా నాయకుడంటే ఇలా వుండాలని కేటీఆర్ నిరూపించారని ఆయన అభిమానులు, బిఆర్ఎస్ నేతలు ప్రశంసిస్తున్నారు. ఇలా సామాన్యుల ప్రాణాలు కాపాడి మంచిమనసు చాటుకున్నారు మంత్రి కేటీఆర్.