Asianet News TeluguAsianet News Telugu

చేనేత కళాకారుల డిజైన్లు కాపీ కొడితే లోపలేయిస్తా : పద్మశాలి సభలో కేటీఆర్ హెచ్చరికలు

చేనేత కళాకారుల డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే కఠిన చర్యలు తీసుకుని లోపలేయిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

minister ktr serious comments on padmashali meeting
Author
First Published Oct 21, 2022, 3:06 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నప్పుడు పద్మశాలి కుటుంబం ఇంట్లోనే వుంటూ చదువుకున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి జీవనోపాధిని అందిస్తున్నది చేనేత రంగమేనని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు చిన్నప్పటి నుంచే చేనేత కార్మికుల కష్టాలు తెలుసునని మంత్రి వెల్లడించారు. 

2002లో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కోసం కేసీఆర్ స్వయంగా జోలెపట్టి విరాళాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష చొప్పున అప్పగించారని.. 2007లో కరీంనగర్ ఎంపీగా చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు రూ.50 లక్షల నిధులను ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.70 కోట్లుగా వున్న చేనేత బడ్జెట్‌ను ఏకంగా రూ.1200 కోట్లకు పెంచారని తెలిపారు. 

Also Read:విఫల విధానాలకు బాధ్యత వహిస్తూ బ్రిటన్ పీఎం రాజీనామా.. మరి మీరెప్పుడు..? : ప్రధాని మోడీపై కేటీఆర్ విమర్శలు

గడిచిన ఎనిమిదేళ్లలో చేనేత శాఖకు ఇప్పటి వరకు రూ.5,752 కోట్లని కేటీఆర్ చెప్పారు. ప్రతీ ఏటా కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నామని.. చేనేత కళాకారుల డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే కఠిన చర్యలు తీసుకుని లోపలేయిస్తామని మంత్రి హెచ్చరించారు. అవసరమైతే చట్టాలను మార్చేలా బాధ్యత తీసుకుంటామని.. చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు. 

అంతకుముందు గురువారం కేటీఆర్ బీజేపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ధనమదంతో మునగోడులో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగతం చేస్తోందో స్పష్టం కనిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలవలేక వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఎన్నిక అని కేటీఆర్ అన్నారు.

మునుగోడు ప్రజలు ఉపఎన్నికలో బీజేపీకి గట్టిబుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నడ్డా అనే అడ్డమైన వాడు 300 పడకల ఆసుపత్రి కట్టిస్తానని ఆరేళ్ల కిందట హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ హామీ ఏమైందని మంత్రి ప్రశ్నించారు. మోడీ, ఇంకో బోడీ ఇక్కడికి వచ్చి పీకేదేమీ లేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మూతిమీద తన్నినట్లు సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ మోడీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని కేటీఆర్ ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios