మూడేళ్లు కాంగ్రెస్‌లో వుండి, కోవర్ట్ రాజకీయం చేసి, బేరం కుదిరాకే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు..? దాని వెనకున్న పెద్దలెవరు..? ఆ గుజరాత్ రహస్యమేంటని ఆయన ప్రశ్నించారు

మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గురువారం టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ధనమదంతో మునగోడులో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగతం చేస్తోందో స్పష్టం కనిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలవలేక వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఎన్నిక అని కేటీఆర్ అన్నారు. మునుగోడు ప్రజలు ఉపఎన్నికలో బీజేపీకి గట్టిబుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. 

నడ్డా అనే అడ్డమైన వాడు 300 పడకల ఆసుపత్రి కట్టిస్తానని ఆరేళ్ల కిందట హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ హామీ ఏమైందని మంత్రి ప్రశ్నించారు. మోడీ, ఇంకో బోడీ ఇక్కడికి వచ్చి పీకేదేమీ లేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మూతిమీద తన్నినట్లు సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ మోడీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని కేటీఆర్ ఆరోపించారు. చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు..? దాని వెనకున్న పెద్దలెవరు..? ఆ గుజరాత్ రహస్యమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. మూడేళ్లు కాంగ్రెస్‌లో వుండి, కోవర్ట్ రాజకీయం చేసి, బేరం కుదిరాకే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఉన్మాద ప్రవర్తనను ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపైనా వుందని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

ALso REad:తెలంగాణలో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌

అంతకుముందు భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ... కోవర్ట్ బ్రదర్స్ అరాచకానికి ప్రతిఫలంగానే ఉపఎన్నికలు వచ్చాయన్నారు. టీఆర్ఎస్‌లో చేరుతున్నందుకు సంతోషంగా వుందని భిక్షమయ్య గౌడ్ అన్నారు. ఎవరి స్వార్థం కోసం ఉపఎన్నిక వచ్చిందో బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టుపట్టించారని భిక్షమయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల్ని రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టాడని ఆయన దుయ్యబట్టారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే నల్గొండ జిల్లాను రూ. లక్ష కొట్లకు తాకట్టు పెడతాడని భిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన దుయ్యబట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను రాజకీయంగా సమాధి చేయాలని భిక్షమయ్య పిలుపునిచ్చారు.