సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులను రాబందుల్లా తిన్నారని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. అలాంటి నేతలు రైతు బంధు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

బుధవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందన్‌కల్ గ్రామానికి గోదావరి నీళ్లు చేరుకొన్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో గోదావరి జలాలకు హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు . మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలే పండించాలని సీఎం కేసీఆర్ చెబుతున్నారన్నారు. కానీ, మార్కెట్లో గిరాకీ లేని పంటలు పండించడం వల్ల రైతుకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు 60 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆరేళ్లలో కేసీఆర్ రైతులకు మంచి పనులు చేస్తున్నారని ఈర్షతో విమర్శలు చేస్తున్నారన్నారు. విపక్షాల తిట్లను కూడ దీవెనలుగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. 

రైతు బంధు పథకం ఇవ్వకుండా ఎగ్గొట్టే ఉద్దేశ్యంతోనే నియంత్రిత సాగును అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.రైతులకు మంచి జరిగే ఉద్దేశ్యంతోనే నియంత్రిత సాగులో భాగంగా ప్రభుత్వం సూచించిన పంటలను వేయాలని కోరారు. 

చెరువులు బాగుంటేనే అన్ని వృత్తులవారికి ఉపాది లభిస్తోందన్నారు. భూగర్భ జలాలు బాగా పెరిగాయన్నారు. జిల్లాలోని 665 చెరువులను గోదావరి నీటితో నింపుతామని చెప్పారు.గోదావరి గమనాన్నికేసీఆర్ మార్చాడని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో హరిత, నీలి,క్షీర విప్లవాలు రాబోతున్నాయని ఆయన చెప్పారు.