కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కంటోన్మెంట్ అభివృద్దిని అడ్డుకుంటుందని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శనివారం శ్రీకారం చుట్టారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కంటోన్మెంట్ అభివృద్దిని అడ్డుకుంటుందని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శనివారం శ్రీకారం చుట్టారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పురాలో నాలా అభివృద్ధి పనులకు, పాటిగడ్డలో మోడ్రన్‌ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌కు మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్‌ను రాష్ట్రం అభివృద్ది చేస్తుందని తెలిపారు. కేంద్రం పేదలకు పట్టాలు ఇవ్వనివవ్వడం లేదని ఆరోపించారు. రోడ్డు నిర్మిస్తామంటే స్థలం ఇవ్వడం లేదని మండిపడ్డారు. రోడ్లు మూసేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. నగరంలో ప్రశాంత వాతావరణం ఉన్నదని తెలిపారు. కుల మతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పాటిగడ్డ ఫంక్షన్‌ హాల్‌ను వచ్చే దసరాకి ప్రారంభించుకుందామని తెలిపారు. భౌగోళికంగా తెలంగాణ, ఏపీ విడిపోయాయని.. రెండు రాష్ట్రాల మధ్య అనుబంధం అలాగే కొనసాగుతుంది అన్నారు. 

ఇక, ఈరోజు ఉదయం చేసిన ట్వీట్‌లో.. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం అని కేసీఆర్ 2001లో చెప్పిన మాటలతో కూడి పేపర్ క్లిప్పింగ్‌ను కేటీఆర్ షేర్ చేశారు. ‘ఇలాగే మే 2001లో ‘కేంద్రాన్నిదారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అన్న కేసీఆర్ గారి audacious statementను ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు వెక్కిరించారు. ఎద్దేవా చేశారు. విరుచుకుపడ్డారు. కానీ నేడు దార్శనికుడైన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సగర్వంగా తలెత్తుకుని నిలబడింది... ’ అని కేటీఆర్ చెప్పారు. 

‘మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు..
తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు..
ఆ తరువాత మీతో కయ్యానికి కాలు దువ్వుతారు..
ఆ తరువాత మీరు విజయం సాధిస్తారు..’ అని మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ తన ట్వీట్‌లో ప్ర‌స్తావించారు.