కాంగ్రెస్‌కు ప్రజలు 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసిందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వారి పాలనలో మంచి చేస్తే ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారు? అని విమర్శించారు.
కాంగ్రెస్‌కు ప్రజలు 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసిందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు చాలా చేశామని చెప్పుకుంటారని.. వారి పాలనలో మంచి చేస్తే ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారని ప్రశ్నించారు. 9 నెలల్లో అధికారంలో వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని అన్న కేటీఆర్.. ‘‘9 నెలల్లో పిల్లలు వస్తారు.. మీరు మాత్రం అధికారంలోకి రారు..’’ అంటూ సెటైర్లు వేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఏం చెప్పిన పాత ముచ్చట్లు చెబుతారని ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడొద్దని అన్నారు.
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి మంత్రి మాట్లాడుతూ.. ఓల్డ్ సిటీ మెట్రో కోసం తాము చిత్తశుద్దితో ఉన్నామని చెప్పారు. తెలంగాణలో మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. ప్రతిపాదనలు పంపిన స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాల్లో మెట్రోకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు.
శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రూ. 985.45 కోట్లతో నాలాల అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 అభివృద్ది పనులకు 11 పూర్తి చేశామని తెలిపారు. మెట్రో ధరలు ఇష్టమొచ్చినట్టుగా పెంచితే ఊరుకోమని చెప్పారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసని అన్నారు.
