పాతబస్తీ అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష.. పాల్గొన్న అక్బరుద్దీన్, రెండ్రోజుల క్రితమే ఇద్దరికీ గొడవ
హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు నుంచి పాటుపడుతోందన్నారు. ఇప్పటికే నగరం నాలుగు వైపులా విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతోందన్నారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు కేటీఆర్. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్‌డీపీ కార్యక్రమంలో భాగంగా పాతబస్తీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయ్యిందని.. సీఆర్ఎంపీ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోందన్నారు. భూసేకరణ నిమిత్తం నిధులను అందించేందుకు కూడా సిద్ధంగా వున్నామని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్‌లతో పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మూసీ నదిపై బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ పనులు సైతం పూర్తి కావొచ్చిందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పాతబస్తీలో సాగునీటి సరఫరా మెరుగుపడిందని.. ఇందుకోసం రూ.1200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతంలో రెండున్నర లక్షలకు పైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా.. అసెంబ్లీలో వాగ్వాదం నేపథ్యంలో కేటీఆర్, అక్బరుద్దీన్ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యపై అక్బరుద్ధీన్ ఓవైసీ సంచలన ప్రకటన
ఇదిలావుండగా.. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది . గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సమయంలో అక్బరుద్దీన్ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై చర్చ సమయంలో ప్రసంగిస్తున్నట్టుగా అక్బరుద్దీన్ తీరు ఉందన్నారు. ఏడురుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎంకు ఇంత సమయం ఇస్తే వందకు పైగా ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి ఎంత సమయం కేటాయించాలని మంత్రి కేటీఆర్ స్పీకర్ ను కోరారు. దీనికి అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 50 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాదు తమ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే విషయమై తమ పార్టీ అధినేతతో మాట్లాడుతానని కూడా అక్బరుద్దీన్ ఓవైసీపీ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.