అలిశెట్టి కుటుంబానికి అండగా ప్రభుత్వం.. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం
అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలబడింది. పేదరికంలో మగ్గుతున్న అలిశెట్టి కుటుంబానికి హైదరాబాద్‌లో డుబల్ బెడ్రూం ఇల్లు కేటాయించింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి కేటీఆర్ తన కార్యాలయాన్ని ఆదేశించారు. దీంతో జియాగూడలో డబుల్ బెడ్రూం సముదాయంలో ఒకదాన్ని అలిశెట్టి కుటుంబానికి కేటాయిస్తూ హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలిచింది. ఆయన కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అలిశెట్టి కుటుంబం అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదరికంలో మగ్గుతూనే ఉన్నది.
సమసమాజం కోసం తపిస్తూ ఇంటిని, వొంటిని మరిచి ప్రాణాలు వదిలిన అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం ఇంకా పేదరికంతో సతమతం అవుతున్నది. అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ అలిశెట్టి కుటుంబానికి అండగా నిలబడాలని అనుకున్నారు. అలిశెట్టి కుటుంబానికి సరైన విధంగా సహాయం అందించాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఇప్పించాలని నిర్ణయించుకున్నారు. తన కార్యాలయాన్ని ఆదేశించారు. దీంతో అలిశెట్టి భాగ్యమ్మ పేరుతో అసీఫ్ నగర్‌లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూం సముదాయంలో ఒకదాన్ని కేటాయించినట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తమపట్ల సానుకూలంగా స్పందించినందుకు అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ, కుమారులు సంగ్రామ్, సంకేత్‌లు సహా ఇతర కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ తండ్రి త్యాగాన్ని గుర్తించి కష్టకాలంలో ఉన్న తమను ఆదుకుని ఓ గూడును చూపెట్టినందుకు రుణపడి ఉంటామని అలిశెట్టి ప్రభాకర్ కుమారులు అన్నారు.
Also Read: ఇండియా వచ్చినప్పుడు జస్టిన్ ట్రూడో డ్రగ్స్ మత్తులో ఉన్నాడా? కెనడా పీఎంవో కామెంట్ ఇదే
పేదరికంలో కొట్టుమిట్టాడుతూనే అలిశెట్టి ప్రభాకర్ తన కలంతో నిప్పులు కురిపించారు. సర్కారుపై తిరుగుబాటుగా కవిత్వాన్ని ఎక్కు పెట్టడమే కాదు, సామాజిక అంశాలను సున్నితంగా స్పృశిస్తూ సామాన్యుల గుండెలనూ సుతిమెత్తగా తట్టారు. అందుకే చిన్న వయసులో మరణించినా అలిశెట్టి ప్రభాకర్‌కు తెలంగాణ సమాజానికి మంచి గుర్తింపు దక్కింది. ఆయనను ఇప్పటికే స్మరిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఆయన రాసిన చిన్న పాదాల కవితలు సామాజిక సమస్యను అద్దంలో చూపెడుతూనే ఉంటాయి.
అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జిల్లాకు చెందిన కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్. అభ్యుదయ కవిగా సమాజం కోసం శ్రమించారు.