త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని ఈ నేపథ్యంలో లో అక్టోబర్1 నుంచి జరిగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల నియోజకవర్గాల వారీగా నియమించిన ఎన్నికల నమోదు ఇన్‌ఛార్జులు తమతమ పనులు మొదలుపెట్టారని చాలా చోట్ల గ్రాడ్యుయేట్లతో కలిసి ఓటర్ నమోదుకు కృషి చేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పంచాయతీ నుంచి శాసనసభ ఎన్నికల వరకు అన్నింట్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని మంత్రి గుర్తుచేశారు. మునిసిపల్, జడ్పీ ఎన్నికల్లోనూ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జిల్లాల పునర్విభజన నుంచి మొదలుకొని కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్‌లు, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వరకు పాలనా వికేంద్రీకరణ ప్రయత్నం చేశామని, రెవెన్యూ చట్టం, పురపాలక చట్టం వంటి నూతన చట్టాలు తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే యువతకు, విద్యార్థులకు సైతం టిఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.  ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ద్వారా వ్యవసాయ సాగు పెరిగిందని మంత్రి తెలిపారు.

దశాబ్దాల నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ రక్కసిని కేవలం ఆరు సంవత్సరాల్లో తరిమికొట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ తెలిపారు. దేశం గర్వించదగ్గ విధంగా యాదాద్రి క్షేత్రాన్ని ప్రత్యేక శ్రద్ధ తో సీఎం కేసీఆర్ పునర్నిర్మిస్తున్నారన్నారు.

వరంగల్ జిల్లా కి మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి వాటితో పాటు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని త్వరలోనే టీహబ్, టాస్క్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

టిఆర్ఎస్ పార్టీ తరఫున 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్నదని, ఇందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.

అక్టోబర్ 1వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అంతా తమ తమ కుటుంబాలతో సహా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.