సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని గచ్చిబౌలిలో అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ అండ్‌ డేటా సెంటర్‌‌ను బుధవారం మంత్రులు కేటీఆర్, మహమూద్‌ అలీ ప్రారంభించారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందన్నారు. ఒకప్పుడు నగరంలో గొడవలు, కర్ఫ్యూలు జరిగేవని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయన్నారు. 

2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాలే మార్పులకు ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో టీ-పోలీస్ విజయవంతమైందన్నారు.

దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో పోలీసుల పాత్ర కీలకమైనదని కేటీఆర్ ప్రశంసించారు.  

280 కోట్ల రూపాయలతో పోలీసులకు కొత్త వాహనాలను సమకూర్చామని... అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పోలీస్ శాఖ పటిష్టతకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నామని.. మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ వల్ల అన్ని శాఖల సమన్వయం చేసి అభివృద్ధి పనులు చేపట్టవచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చే రెండు నెలల్లో పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పోలీస్ టెక్నాలజీ తో సమానంగా హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రాబోతుందని కేటీఆర్ వివరించారు.

హైదరాబాద్ లో క్రైమ్ చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని.. ఒకవేళ ధైర్యం చేసినా గంటల వ్యవధిలోనే దొరికిపోతారని మంత్రి చెప్పారు. ఎమర్జెన్సీ లో అంబులెన్స్ లు త్వరగా చేరుకునేందుకు రూట్లను సెట్ చేస్తే బాగుంటుందని కేటీఆర్ ఆకాంక్షించారు.

హైదరాబాద్ లో ఎమర్జెన్సీ అంబులెన్స్ లు  హాస్పిటల్స్ కు వెళ్లేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి డీజీపీని కోరారు. మహిళ రక్షణ కోసం మరిన్ని సేవలు అందుబాటులోకి తేవాలన్న మంత్రి .. డ్రోన్ పోలీసింగ్ అమలు కోసం ఏవియేషన్ అనుమతి తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు.

క్రైమ్ తగ్గింది కానీ సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పై తెలంగాణ పోలీస్ శాఖ దృష్టి పెట్టి అరికట్టాలని కేటీఆర్ తెలిపారు.