అలా జరిగుంటే బ్రతికేవాడివేమో తమ్ముడూ..: సాయిచంద్ మృతదేహం వద్ద కేటీఆర్ కంటతడి (వీడియో)
తెలంగాణ గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ సాయిచంద్ మృతదేహం వద్ద ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన యువ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సాయచంద్ మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయిన మంత్రి కంటతడి పెట్టుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆటాపాటలతో అలరించే సాయిచంద్ ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. చిన్న వయసులోనే మంచి కళాకారుడిగా గుర్తింపుపొందిన సాయిచంద్ హఠాన్మరణం బాధాకరమని... అతడి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని కేటీఆర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ సాయిచంద్ మృతదేహానికి నివాళి అర్పించారు. బోరున విలపిస్తున్న అతడి కుటుంబసభ్యులను ఓదార్చి సానుభూతి ప్రకటించారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నాయకులను పట్టుకుని సాయిచంద్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు కేటీఆర్.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...రాతి గుండెలను సైతం తన పాటతో కరిగించిన కళాకారుడు సాయిచంద్ అంటూ కొనియాడారు. మంచి ఆత్మీయుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. సాయిచంద్ లేనిలోటు తీర్చలేనిదని కేటీఆర్ అన్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు విధి ఎంత ఘోరమైందో అర్ధమవుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు.
అత్యంత చిన్నవయసులో గుండెపోటుకు గురయి సాయిచంద్ చనిపోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు.గుండెపోటు వచ్చిన సమయంలో హైదరాబాద్ లోనే వుంటే అతడు బ్రతికేవాడేమోనని అన్నారు. తండ్రిని కోల్పోయిన పిల్లలను చూస్తుంటే బాధగా వుందని... సాయిచంద్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా సాయిచంద్ అందరినీ ఏకం చేసాడని కేటీఆర్ అన్నారు. ఉద్యమంలో తమ్ముడు తమతో కలిసి పని చేసాడని మంత్రి గుర్తుచేసుకున్నారు. తన పాటలతో విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడగలిగాడని అన్నారు. తెలంగాణను ప్రేమించే వాళ్ళలో సాయిచంద్ గాత్రం వినని వాళ్లు ఉండరని కేటీఆర్ అన్నారు.